ఒక ప్రభాత వేళలో
నిశ్శబ్దం నిశీధిలా కమ్ముకుని
నాట్యం చేస్తున్నప్పుడు,
నా నయనం నిన్ను చూసింది.
చూడగానే
తనువంతా శిలలా మారింది!
ఒక శిశిరం చివరలో
నీవు ఆమనివై నడిచి వస్తున్నప్పుడు,
నీ అందెల సవ్వడి
నా హృదయంలో చేరింది.
చేరగానే
నా నరనరాల్లో
ఆనందం ప్రవాహమై పారింది!
ఓ సౌందర్య శ్రీ!
ఎవరు నువ్వు?
నన్ను చూడగానే ఎందుకు నీకా నవ్వు.
ఆకాశంలో హఠాత్తుగా
తళుక్కుమనే తారలా కన్పించావు.
ఆ తరువాత
నేను నీ కోసం నిరీక్షిస్తున్నప్పుడు
కనిపించడం మానేసావు.
యిది నాకు పరీక్షా?
లేక నువ్వు చూడగానే మాట్లాడలేదని
నీవు వేసిన శిక్షా?
నీ కోసం అన్వేషిస్తున్నప్పుడు
నా స్థితిని చూసి
పువ్వులా నవ్వుతావు!
విరహ తామసిలో విహరిస్తున్నప్పుడు
నా గతిని చూసి దివ్వెలా వెలుగుతావు!
అర విరిసిన పుష్పంలో ప్రత్యక్షమై
నాలో ఆశలు రగిలిస్తావు!
పరుగులతో నీవైపు వస్తుంటే
మాయమైవాటిని అడియాసలు చేస్తావు!
ఎందుకు నాపై కోపం?
ఎన్నాళ్ళీ మౌన జపం?
సిరుల ఝరులు తెచ్చి
నీ సిగలో కూర్చనా!
నా మనస్సును మల్లెలుగా మార్చి
నీకు అర్చన చేయనా!
నీవు నవ్వుంతుంటే
నాకు నవవసంతం కనిపిస్తుంది!
నీవు నా వైపు నడిచి వస్తుంటే
స్వప్నం సాకారమైనట్టుంటుంది!
నీ ఏడుపు నాకు అశోక వనం!
నీ పిలుపు నాకు కోటి వేణువుల గానం!
నీ చెక్కిలి పై చుక్క గగన తలంలో తారక!
నీ సిగలోని సిరిమల్లినడిరేయిలోని జాబిల్లి!
ఎన్నాళ్ళు బ్రహ్మ మలిచాడో కదా
పుత్తడి బొమ్మ లాంటి నీ రూపం!
నీ నవ్వును చూడగానే వెలగదా
చీకటిలో సైతం చిరుదీపం!
ఓ సౌందర్య శ్రీ!
నీవు అలవై ఎగిరి వస్తావని
నా కలల నెరవేరుస్తావని
కాలం కడలి అంచున న రాకకై వేచి వుంటా!
నీ అడుగులు పుడమిని తాకకుండా
నా కరములను చాచివుంటా!
తప్పక వస్తావు కదూ!
నీ స్నేహామృతంతో నా దప్పిక తీరుస్తావు కదూ!!
Monday, December 18, 2006
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
emta adbhutam gaa vumdi.manasunu taakea amdamaina bhaavana sammahaaram ii kavita
Post a Comment