యెదలోన గుచ్చినావు యేదో శరమున్
అది తీయని కూరిమినా
యెదలో నింపినది నీవు యెవరవు భామా!
కొమ్మలయందున దాక్కొని
రమ్మని పిలిచెదవు నన్ను కమ్మని పిలుపై
జుమ్మని వీచెడి గాలిన్
గమ్మత్తుగ జెప్పుతావు కబురులు యేవో!
మిలమిల మెరుపై ననుగని
పెళపెళ ఉరుముల పలుకుల పిలిచితివంతన్
గలగల యేరై జలదిన
చిలిపిగ దాగితివి నీవు జిక్కవె లలనా!
అల సుప్రభాతమందున
సలిలము చిగురాకుపైన సంస్థితమై ర
వ్వల వలె భాసించినటుల
చెలి!వెలిగెను చుక్క నీదు చెక్కిలిపైనన్!
చుక్కయు నొకటి నుదిటిపై
చిక్కగ బెట్టితివి ఒకటి చెక్కిలి పైనన్
చుక్కలు యెందుకు నీకును
చుక్కల నిరతం వెలిగెడి చుక్కవు నీవున్!
ఎక్కడ ఉంటివనెదకగ
పక్కున నవ్వెదవు నీవు పక్కనె ఉంటున్
జిక్కితివని నే తలచగ
మక్కువలేనటులైతివి మాయంబంతన్!
పిలిచితెపుడు నీ నామము
తలచితి నా ప్రేమ దేవతవు నీవని నే
కొలిచితి మనము కమలముగ
వలచితిటుల నీవు నాకు ప్రాణమని సఖీ!
కంటిన్ నీ కంటిని నా
కంటిని యది గాయపరచి కుంటిని చేసెన్
వింటి శరమ్ముల ఘాతము
కంటెను నీ కంటి చూపు ఘనము లతాంగి!